అధికారులను వెంటాడుతున్న కేసులు!
సర్కారు నౌకరి దొరికితే చాలు జీవితం హాయిగా సాగిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ, కొందరు ఉద్యోగులు, అధికారులు కేసుల్లో చిక్కుకోవడం.. హత‘విధి’ అనుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాజకీయ నాయకులు, పాలకుల చేతుల్లో పావులుగా మారిన కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, అధికారులు రెండు దశాబ్దాలుగా కేసుల పాలవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలోనే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలకులపైనే ఆరోపణలు వెల్లువెత్తుగా ఇప్పుడు మాత్రం బీఆర్‌ఎస్ పాలనకాలంలో అక్రమాలు జరిగాయనే వాదనల నేపథ్యంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కేసులు ఎదుర్కొంటున్నారు. ఏదిఏమైనా.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన వారికి ఎప్పటికైనా ‘చెర’ తప్పదని స్పష్టమవుతోంది. రిటైర్‌మెంట్ తర్వాత కుటుంబంతో హాయిగా గడపాలనుకున్న వారికి ఈ కేసులు తలనొప్పిగా మారుతున్న తరుణంలో కూడా కొందరు అధికారులు.. తమ విధులను రాజకీయ నాయకులకు తాకట్టుపెట్టే వారు లేకపోలేదు. మరి అది వారి ‘విధి’రాత అనుకోవాల్సిందేనా? – నమస్తే.