ప్రేమ అనగా?
ఆ స్కూలే నిర్వచనం!
ప్రేమ అనగా..? తల్లిదండ్రులు పిల్లలపై చూపే అనురాగం కాదు! భార్యభర్తల మధ్య గల అన్యోన్యత కానే కాదు! యువతీయువకుల లోగిలి అసలే కాదు! ప్రేమ అనగా? సేవ! ఈ పదాలకు ఆ స్కూలు ఓ నిర్వచనం. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ఊకల్‌ హవేలి గ్రామంలో గల ‘సెయింట్‌ జాన్స్‌ హైస్కూల్‌’ ఎంబ్లమ్‌లో ముద్రించారు. ఏ మోటివేషన్‌తో ఆ పదబంధాన్ని ఎవరు ఎంపిక చేశారో గానీ.. ప్రేమ అనగానే రకరకాల నిర్వచనాలు వెతికేవారిని ఈ కొటేషన్‌ భావోద్వేగానికి గురి చేస్తుందని అనిపిస్తోంది. భారతదేశంలో మదర్‌ థెరిసా అందించిన సేవలు అందరికీ తెలిసిందే. ఆ మహానుభావురాలి సేవాతత్పరతలో ఎంత ప్రేమభావం దాగున్నదో ఈ పదాలు స్పష్టం చేస్తున్నాయనిపిస్తుంది. నిజానికి అమ్మానాన్నలు పిల్లల కోసం ఏ పనులు చేసినా, ఎంత కష్టపడినా తామంటే వారికి పిచ్చిప్రేమ అంటామే గానీ, అందులో సేవ దాగుందని గుర్తించేవారు ఎందరుంటారు. అదే ఈ స్కూల్‌ ఎంబ్లమ్‌లో గల పదాలు చదివిన వారికి ప్రేమలోని సేవాగుణం మనసులో నాటుకోక తప్పదనిపిస్తుంది. ఇలాంటి పదాల వెనుక గల ఆంతర్యం తెలిసే చేస్తే పాఠశాల స్థాయి విద్యార్థులను కచ్చితంగా ప్రభావితం చేస్తాయనిపిస్తుంది. ఇలా ఒక ఆదర్శవంతమైన నినాదాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనే ఆ స్కూలు నిర్వాహకుల ఆలోచన అద్వితీయం.. అనిర్వచనీయం.. అనుసరణీయం. డీజీ స్కూల్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అంటూ తల్లిదండ్రుల మనస్సులను దోచుకునే నేటి పాఠశాలల యాజమాన్యాలు ఇలాంటి ఆదర్శనీయమైన నినాదాలపై దృష్టి సారించి.. విద్యార్థుల్లో మంచి భావనలు పెంపొందించేందుకు కృషి చేస్తే సమాజ హేతువుగా ఉంటాయేమో కదా!


అవును నిజమే!
ఇదే విషయమై అదే స్కూలు 1993`94 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ విద్యార్థి కూసం రమేశ్‌, రాయపురెడ్డిని సంప్రదించగా.. తమ బ్యాడ్జ్‌ మీద ‘ప్రేమ అనగా సేవ’ అని రాసి ఉండేది.. అప్పట్లో దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన లేకున్నా.. ఆనాడు తమ హెడ్‌మిస్ట్రెస్‌ సిస్టర్‌ ఫ్రాన్సీనా, ఇతర ఉపాధ్యాయులు తమను ఎంతో ప్రేమగా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. పొరపాట్లు చేస్తే సిస్టర్‌ చాలా కోపం చేసేవారు.. చివరకు చాక్లెట్లు గానీ, పెన్నులు గానీ గిఫ్ట్‌గా ఇవ్వడం చూస్తే.. తమను ఎంతగా ఆదరించారో అర్థమవుతోందని పేర్కొన్నారు. అందుకే అప్పటి చర్చి ఫాదర్‌ అంతపురెడ్డి పెట్టి ఆ క్యాప్షన్‌ పెట్టి ఉంటారని వారిద్దరూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
` (కొత్తపేపర్‌.కామ్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *