తెలంగాణలో పరిపాలన తీరుపై అసంతృప్తి
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది. పరిపాలన సవ్యంగా సాగుతున్నదా? ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడుస్తోందా? ఇలా సందేహాలెన్నో? నేతల తీరు.. అధికారుల వ్యవహార శైలిపై పలు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఒకపక్క అధికారులు లంచానికి తెగబడి వెయ్యి రూపాయలకు కూడా కక్కుర్తి పడి అడ్డంగా దొరుకుతున్నారు. మరోపక్క నేతలు కేసుల పాలవుతున్నారు. అవినీతి ఊబిలో కొందరు.. అక్రమ దందాల్లో మరికొందరు కటకటాలకు దగ్గరవుతున్నారు. తీరా.. తమను కేసుల నుంచి తప్పించాలని కోర్టులకెక్కుతున్నారు. ఇంకోపక్క కట్టిన నీటి ప్రాజెక్టుల్లో లోపాలు ప్రమాదాలను హెచ్చరిస్తున్నాయి. ప్రజలు ఒకరినొకరు దోచుకుంటున్నారు. చంపుకుంటున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రజల మీద మత్తు పదార్థాలు వెదజల్లి సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు.. అన్యాయపు అడుగులకు మడుగులొత్తుతున్నారు. పాలకులు పైసలు లేవంటూ పరిహాసం చేస్తున్నారు. పథకాల పేరిట ప్రజలను దగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అన్నీ చూస్తున్న ప్రజలు ఓటుకు వెయ్యిస్తారా? రెండు వేలు ఇస్తారా? అనే ఆశలో కాలం వెళ్లదీస్తున్నారు. – నమస్తే.