ఏదీ పూర్తి కాకుండానే! పథకాల అమలులో పాలకుల వ్యూహం
అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. ఇదీ పాలకుల మాట.. హామీ.. గ్యారంటీ! కానీ, అమలులో మాత్రం ఆరంభ శూరత్వమే కనిపిస్తుంది. తొలుత రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం, చేయకపోవడం వారిష్టమే. ప్రమాణ స్వీకారం రోజునే ఏదో ఒక పథకం.. ఆరంభిస్తారు. ఇక మిగతా పథకాలు ఒక్కటొక్కటి అంటూ వాయిదాలు వేస్తుంటారు. ఆ ఒక్కొక్కటి కూడా ఏదో కొందరిని ఆగమేఘాల మీద గుర్తించి.. పెద్ద నేతల చేతులమీదుగా అమలు చేస్తారు. ఆ తర్వాత అధికారులో లేదా స్థానిక ప్రజాప్రతినిధులకో బాధ్యతలు అప్పగిస్తారు. ఆ పథకం ఎంతమందికి, ఎవరికి అందుతుందో అర్థం కాని పరిస్థితి. ఈలోగా కొత్త పథకం అంటూ మరొకటి. ఇలా పథకాల పేరు చెప్పి.. పాలన కాలాన్ని అనుభవిస్తున్నారే తప్ప.. అభాగ్యుల సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో పట్టించుకునే వారు కరువయ్యారు. అందుకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలే నిదర్శనం. ప్రస్తుత ప్రభుత్వం.. ఆరు గ్యారంటీలంటూ ప్రమాణస్వీకారం రోజున మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత.. ఉచిత విద్యుత్ స్కీం ఎంతమందికి ఇచ్చిందో గానీ, ఇప్పటికీ పలువురు నిరుపేదలు ఆ పథకం అమలవుతుందనే ఆశలో ఉన్నారు. అలాగే, 500లకే గ్యాస్ సిలిండర్ స్కీం పూర్తిస్థాయిలో అందకముందే.. రేషన్‌కార్డుల ముచ్చట ముందటేసుకున్నారు. ఆ కార్డుల కోసం ఇప్పటికీ సర్వేలే కొనసాగుతున్నాయి. ఇక మహిళలకు రూ.2500 ఆర్థికసాయం అటకెక్కించి, మహిళలను కోటీశ్వరులను చేస్తామని, హోటళ్లు పెట్టించే పనికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ భృతి హామీని నీళ్లల్లో కలిపేసి.. ఉపాధి అవకాశాలంటూ యువ వికాసం ఆరంభించారు. అది ఎంతమందికి ఇచ్చారో? ఇస్తారో తెలియని పరిస్థితి. ఇలా ప్రభుత్వం.. పథకాల పేరిట ప్రజలను గందరగోళానికి గురిచేయడం తప్ప.. ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక ముందుముందు ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెడతారో? ఎంతమందికి ఇస్తారో? వేచిచూడాల్సిందే. – నమస్తే.