అన్నీ ఇస్తున్నా.. అల్లుని నోట్లో శనేనా?
బట్టలు ఇస్తున్నాం.. పుస్తకాలు, కాపీలు అందిస్తున్నాం.. మధ్యాహ్నం అన్నం పెడుతున్నాం.. రాగి జావ పోస్తానం.. ఏటా కోట్లాది రూపాయలు సర్కారీ విద్యకు ఖర్చు చేస్తున్నాం.. ఇదీ ప్రభుత్వాల లెక్కలు. వసతులు, నిధులు.. ఖర్చులు ఎలా ఉన్నా.. సదువుల స్థాయి ఏమిటనేది సందేహాత్మాకమే. ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకోవడానికి అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషు మీడియంలోకి మార్చారు. మరి ఉపాధ్యాయులందరూ ఆంగ్ల బోధనలో ప్రావీణ్యులేనా అనే సంశయం తీరని ప్రశ్నగా మిగలనుంది. ప్రైవేటు పాఠశాలల పిల్లలు ఏంచక్కా ఇంగ్లిషులో మాట్లాడుతుంటే.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మై నేమ్ ఈజ్ అని చెప్పలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి. తూ ఇదర్ ఆయి యే.. అన్నట్లుగా స్కూలుకు గోయింగ్.. ఇంటికి కమింగ్ అన్న చందానే ప్రభుత్వ చదువులు వెలగబెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కూలి చేసుకున్న వారు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోకే పంపించాలనే ఆలోచనల్లో పడుతున్నట్లు అర్థమవుతోంది.
సార్లు చెబుతున్నారా? పిల్లలకే రావడం లేదా?
ఇప్పుడున్న ప్రభుత్వ ఇంగ్లిషు మీడియం స్కూళ్లన్నీ తెలుగు మీడియం పాఠశాలలే. కాలక్రమంలో పరిస్థితులకు అనుగుణంగా బోర్డులు మార్చి ఆంగ్లమీడియంగా మార్చేశారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. పంతుళ్లు ఆంగ్లంలో బోధించగలరా? అనే సందేహాలు తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తున్నాయి. కొన్ని సార్లు ఇంగ్లిషు ఉపాధ్యాయులే తెలుగులో మాట్లాడక తప్పదు. అలాంటిది ఇతర సబ్జెక్టుల మాస్టార్లు ఏ భాషలో బోధిస్తున్నారో పిల్లలకు తప్ప ఎవరికీ తెలియదు. ఒకవేళ అడిగినా పిల్లలు దాటవేత ధోరణి తప్ప సరైన సమాధానం దొరికే అవకాశం లేదనేది అందరికీ తెలిసిందే.
యూట్యూబ్ రిఫర్?
కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే యూట్యూబ్ చూడమని రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలకు అర్థమయ్యేరీతిలో చెప్పలేక అలా చెబుతున్నారా? లేదా? వారికి ఆంగ్ల భాష మీద పట్టులేకపోవడమా? అనేది తేలాల్సి ఉంది. ఒకపక్క పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వకూడదని ప్రచారం చేస్తుండగా, మరోపక్క ఉపాధ్యాయులే యూట్యూబ్ చూడమనడం.. హాస్యాస్పదంగా మారుతోంది. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు కచ్చితంగా ఇంగ్లిషులోనే మాట్లాడాలనే నిబంధన ఉంటుందని తెలుస్తోంది. అలా పిల్లలు వచ్చినా రాకపోయినా మాట్లాడుతున్నా కొద్దీ తర్ఫీదు పొందుతుంటారని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి పరిస్థితులు లేవు. ఒకవేళ అలాంటి నిబంధనలు పెడితే.. పిల్లలు ఎక్కడ మానేస్తారో? ఎక్కడ బలగం తగ్గిపోతుందో అనే ఆందోళనకర పరిస్థితుల్లో ప్రభుత్వ విద్య ఉండడం గమనార్హం. బట్టలు, పుస్తకాలు, అన్నం.. అవసరమైన వసతులు కల్పిస్తున్నా.. సరైన బోధన వ్యవస్థ లేకపోవడం అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా మారుతోంది ప్రభుత్వ విద్యారంగం.