• సీఎం కావాలి!
  • అందరి రాజకీయ నేతల ఆకాంక్ష అదే!
  • మంత్రులు, ఎమ్మెల్యేల్లో చెలరేగుతున్న ఆశలు
  • సాధారణ నాయకుల్లో సైతం పెరుగుతున్న కోరిక
  • యువకుల్లో కనిపించని రాజకీయ కాంక్ష
  • ఎన్నికలప్పుడే పార్టీల పేరిట ప్రచారానికే పరిమితం
    సీఎం కావాలి.. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎక్కువ శాతం మంది ఆకాంక్షిస్తున్న పీఠం. అందరి కళ్లు ముఖ్యమంత్రి కుర్చీపైనే. అధికారంలో ఉన్న వారు ఆ పదవిలో ఉన్నవారిని ఎలా పడగొట్టాలని ఎత్తులు వేస్తుంటే.. అధికారంలో లేని పాలన పగ్గాలు అందుకోవాలనే తపన తాపత్రయ పడేవారు అనేకులు ఉన్నారు. అవకాశం దొరికితే.. తమ వ్యామోహాన్ని బాహాటంగా వెళ్లగక్కే వారు లేకపోలేదు. వారి ఆకాంక్ష నెరవేరినా, లేకున్నా… తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదనేది అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వారు కూడా తమ సీనియారిటీని గుర్తు చేసుకుంటూ సీఎం పదవిపై గల తమ కోరికను అడపాదడపా బహిర్గతం చేస్తూనే ఉన్నారు. కానీ, నేటి యువత మాత్రం కనీసం రాజకీయాల వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం విచారకరం. ఇదే క్రమంలో యువతకు ప్రస్తుత పాలకులు సరైన ప్రాధాన్యమివ్వడం లేదని వాదించేవారు కూడా ఉన్నారు. అలాంటి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేయకపోవడం.. రాజకీయాల్లో మార్పులకు అవకాశం లేకుండా పోతోంది. ఆ పార్టీ కాకపోతే, ఈ పార్టీ అనేలా ఎన్నికల్లో ఓటు మార్పిడి మాత్రమే జరుగుతోంది తప్ప.. ప్రజలు కోరుకునే అసలు పాలనకు అడుగులు పడడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సైతం రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నా యువత మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటోంది. కేవలం ఉద్యోగమే తమ జీవితం అన్నట్లుగా ఆరాటపడుతున్నారే తప్ప.. రాజకీయ పదవులు కూడా ఒక ఉద్యోగమే అనే విషయాన్ని గుర్తించడం లేదు. 30, 40 ఏళ్లు పని చేస్తే గానీ ఉద్యోగులకు పింఛన్‌ రాదు, అదే రాజకీయ పదవుల్లో ఐదేళ్లకే పింఛన్‌, పలు అలవెన్సులు అందుతున్నాయనే సూక్ష్మమైన అంశాన్ని పరిగణించడం లేదని అర్థమవుతోంది. విద్యార్థులుగా ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు పాలకుల ముందు డిమాండ్లు పెట్టే యువత.. తామే రాజకీయాల్లో అడుగుపెట్టి.. తమ సమస్యల పరిష్కారానికి బీజం వేసుకోవాలనే తపించకపోవడం, లీడర్‌షిప్‌ క్వాలిటీని పెంపొందించుకోకపోవడం ఆరోగ్యకర సమాజ సృష్టికి అవరోధమే అవుతుంది. కేవలం ఎన్నికల సమయంలో పార్టీల జెండాల నీడల్లో కదలాడడం మానేసి.. రాజకీయాల్లో కొత్తపుంతలు సృష్టించేందుకు యువత ఇప్పటికైనా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.