
కొత్తిళ్ల మీద కరెంటోళ్ల కనుదిష్టి!
ఈ నిబంధన ఎంతమందికి తెలుసో?
కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నామనే సంతోషం.. కరెంటోళ్ల కనుదిష్టితో పటాపంచలు అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు వస్తారో.. ఎలా వస్తారో తెలియని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు మరో అవకాశం లేకుండానే జరిమానాలు వేస్తారు. ఇదేమిటని అడిగితే.. కరెంట్ మీటర్ స్థాయికి అనుగుణంగా వినియోగించడం లేదని, విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని హూంకరిస్తారు. ఇంతకు ఈ నిబంధన జనంలో ఎంతమందికి అవగాహన ఉందో? విద్యుత్ అధికారులు ఎంతమందికి అవగాహన కల్పించారో..? జరిమానా షాక్ కొట్టేవరకు అర్థం కాని పరిస్థితి. వేలకు వేలు కరెంట్ బిల్లులు కట్టని వారి పట్ల ఉదాసీనత ప్రదర్శించే.. విద్యుత్ శాఖ.. మీటర్ ఉన్నప్పటికీ కేటగిరీల సాకు చెప్పి.. అమాయకులపై ఫెనాల్టీలు వేయడం.. కరెంటోళ్ల కనుదిష్టికి నిదర్శనమనే చెప్పాలి. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతుంటారు.. కానీ, వీరు ఇళ్ల మీదకు వచ్చారంటే.. మెతుకు మింగే అవకాశం కూడా ఉండదని విద్యుత్ శాఖ అధికారులందరూ ముక్తకంఠంతో బాధితులకు సమాధానమిస్తున్నారు.
పాత ఇల్లు కూలగొట్టి కట్టుకునే వారు జాగ్రత్త!
ముఖ్యంగా పాత ఇల్లు కూలగొట్టి కట్టుకునే వారు విద్యుత్ వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీటర్ ఉంది కదా? అని ఇల్లు ప్రారంభిస్తే.. ఏ మిట్టమధ్యాహ్నమో, అర్ధరాత్రి వేళో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గంగిరెద్దుల ఆటగాళ్ల మాదిరి ఇళ్ల ముందు వాలుతుంది. ఇంటి యజమాని నోరు తెరిచే లోపే.. తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకుని, విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లుగా అంగీకరించామంటూ మాయమవుతారు. ఆనక.. వారికి తీరిక దొరికినప్పుడు.. ఏళ్లు గడిచాక.. ఫలానా రోజున విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని, అందుకు కొన్ని వేలు జరిమానా కట్టాలంటూ నోటీసులు జారీ చేస్తారు. అది కట్టాలంటూ విద్యుత్ శాఖ నుంచి ఫోన్లు.. బెదిరింపులు ఆగవు. ఆ వేధింపులు భరించడం కంటే.. పాత ఇల్లు కూలగొట్టగానే.. ముందుగా విద్యుత్ శాఖను సంప్రదించి.. ఇల్లు కట్టుకుంటున్నామని అవసరమైతే ఆహ్వాన పత్రిక ముద్రించి అందించి.. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం మంచిది. లేదంటే.. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ రూపంలో విద్యుత్ శాఖ కొత్త ఇళ్ల మీద దిష్టికన్ను తెరుచుకుని చూస్తుంటుంది. అదను చూసి.. ఇల్లు గుల్ల చేసే జరిమానాల షాక్ కొట్టిస్తుంది.
అవగాహన కల్పించరా?
విద్యుత్ వినియోగంలో నిబంధనలు ఏమిటో? కరెంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరికీ సరిగా తెలియదనే చెప్పాలి. చదువురాని వారే కాదు, చదువు వచ్చిన వారికి కూడా అవగాహన శూన్యమే. విద్యుత్ అధికారులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు చరిత్రలో లేదేమో? ఆగమేఘాల మీద ఇళ్లపై వాలి ఫైన్లు, కేసులు అంటూ భయానక వాతావరణం సృష్టించడం కంటే ముందు విద్యుత్ వినియోగంలో గల నిబంధనలు ఏమిటో ఇప్పటికైనా అవగాహన కల్పించడం తమ బాధ్యతగా గుర్తించాలి. ఒకపక్క కులాలు, మతాలు, వర్గాల పేరిట ఉచితంగా కరెంట్ అందిస్తున్న ప్రభుత్వాలు.. చిన్నచిన్న పొరపాట్లను భూతద్దంలో చూపించి.. అమాయకులు, నిరుపేదలపై జరిమానాల కరెంట్ షాక్ పెట్టడం.. వివక్షతో కూడిన చర్యలుగా భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఉచితంగా అందించే విద్యుత్‌కు అయ్యే ఖర్చులో ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని గుర్తించి.. అందరికీ సమన్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఈ వివక్షకు అంతం లేకుండా పోతుంది. విద్యుత్ శాఖ అధికారుల దౌర్జన్యపు చర్యలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది.
