సిరాకు లేని గిరాకీ!
రీఫిల్స్‌కు చెల్లిన కాలం
యూజ్‌ అండ్‌ త్రో పెన్నులదే హవా
రూ.3కే పెన్ను.. రీఫిల్‌ కంటే తక్కువే
రాసి పడేసే పెన్నులకే పెరిగిన డిమాండ్‌

విద్యార్థి దశలోనే కాదు.. ప్రతీ వ్యక్తి జీవితంలో పెన్ను ఒక భాగమే. రైతులు, కూలీలకు పెన్నులతో నిత్యం అవసరం లేకఅయినా ఏదో ఒక రోజు పెన్ను పట్టుకోవాల్సి వస్తుంది. చదువు రాకపోయినా సంతకాలు వచ్చే వారికి సైతం పెన్ను ఉపయోగించే సందర్భం రాక తప్పదు. అందుకే విద్యార్థులు పెన్నును కూడా సరస్వతీ దేవీ ఆయుధంగానే భావిస్తారు. పవిత్రంగా చూసుకుంటారు. వినాయక చవితి రోజున పూజలో పుస్తకాలు పెట్టడం ఆనవాయితీగా ఉండేది. పుస్తకాలతో కొందరు కొత్త పెన్నులు, వాటితోపాటు రీఫిల్స్‌ కూడా కొని పూజలో పెట్టుకునేవారు. ఆ సంవత్సరం అంతా ఆ పెన్నులతో రాస్తే మంచి మార్కులు వస్తాయని నమ్మేవారు.
రకరకాల పెన్నులు!
ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల పెన్నులు ఉన్నాయి. ఎవరికి నచ్చిన పెన్ను వారు వాడుతున్నారు. 30, 40 ఏళ్ల క్రితం పత్తి పెన్నులు వాడేవారిని గొప్పగా చూసేవారు. పంతుళ్లు ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు వాటి వాడకం చాలావరకు తగ్గిందనే చెప్పాలి. వాటి స్థానంలో స్కెచ్‌పెన్‌ టైప్‌ పెన్నులు ఉపయోగిస్తున్నారు. 1990 దశకంలో రేనాల్డ్స్‌ కంపెనీ పెన్నుల హవా నడిచింది. బ్లూ కలర్‌ క్యాప్‌, వైట్‌ కలర్‌ డొప్పతో కూడా పెన్నులు ప్రతీ జేబులో కనిపించేవి. ఆ తర్వాత రెడ్‌ కలర్‌, గ్రీన్‌కలర్‌, బ్లాక్‌ కలర్‌ సిరా పెన్నులకు .. ఆయా రంగులతో కూడిన పెన్నులను ఆ కంపెనీ వినియోగంలోకి తీసుకొచ్చింది. 2000 సంవత్సరం నాటికి రేనాల్డ్స్‌ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. సెల్లో 0.5 పెన్నులు ఆకస్మికంగా మార్కెట్‌ను కబ్జా చేసినంత పని చేశాయి. ప్రస్తుతం వాటి ప్రాభవం కూడా లేకుండా పోయింది.
అంతా యూజ్‌ అండ్‌ త్రో!
2020 వచ్చే నాటికి యూజ్‌ అండ్‌ త్రో పెన్నులు మార్కెట్‌ను ఆవరించాయి. ఎవరి చేతిలో చూసిన వీటి వినియోగమే ఎక్కువగా ఉంది. షాపుల్లో కూడా వీటినే ఎక్కువగా స్టోర్‌ చేస్తున్నారు. సాధారణ పెన్నులైతే రీఫిల్‌ కొనాల్సి ఉంటుంది. యూజ్‌ అండ్‌ త్రో పెన్ను అయితే, ఎప్పటికప్పుడు కొత్త పెన్ను వాడుతున్నట్లుగానే ఉంటుంది. అంతేకాదు, రీఫిల్‌ డబ్బులు పెడితే, పడేసే పెన్నులు రెండు, మూడు వచ్చే అవకాశం ఉండడంతో చాలామంది వీటిపైనే మక్కువ చూపిస్తున్నారు. ఆఫీసుల్లో కూడా టేబుల్‌ వర్క్‌ కోసం వీటినే వాడుతున్నారు. ఒకవేళ టేబుల్‌పై మరిచిపోయినా.. మాయం అయ్యే ఛాన్స్‌ ఉండదు.
పాతకాలం రేటే!
30, 40 ఏళ్ల కిందట మూములు పెన్ను రెండు రూపాయలు ఉండేది. అందులో రీఫిల్‌ 30 పైసల నుంచి 50 పైసల వరకు ఉండేది. ఇప్పుడు అదే రెండు లేదా మూడు రూపాయలకు ఏకంగా పెన్నే వస్తోంది. మళ్లీ రీఫిల్‌ కొనాల్సి అవసరమే లేదు. అప్పుడున్న ఆర్థిక స్తోమతకు రెండు రూపాయల పెన్ను ఖరీదే. కానీ, ఇప్పుడు చాయ్‌కే పది రూపాయలు పెట్టాల్సి వస్తోంది. రెండు రూపాయల పెన్ను.. గంటకొక్కటి కొన్నా.. ప్రజలు భారంగా భావించే పరిస్థితి లేదు. దీంతో యూజ్‌ అండ్‌ త్రో పెన్నుల కాలం పరుగులు తీస్తోంది. రీఫిల్‌ కొనాలనే సిరాకు లేకుండా పెన్నుల వినియోగం, విక్రయాలు అలాఅలా సాగిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *