
మహాభారత కాలంలో కోర్టులు ఉండి ఉంటే కురుక్షేత్రం జరిగి ఉండేది కాదేమో! అసలు వనవాసం అనే శిక్ష ఉండేది కాదేమో! ఇప్పటిలాగా అప్పుడు పోలీసులు ఉండి ఉంటే గ్రామ బహిష్కరణలను అడ్డుకున్నట్లు అప్పడు పాండవుల రాజ్య బహిష్కరణను అడ్డుకుని ఉండేవారేమో! ఇక అప్పుడు కురుక్షేత్రం అనే పదమే వినపడేది కాదేమో! అదిగాక, కోర్టులుంటే పాండవులు తమ రాజ్యం కోసం కోర్టులను ఆశ్రయించి ఉండేవారేమో! అప్పుడు కౌరవులు, పాండవుల మధ్య సివిల్ కేసు సాగి ఉండేది. ఆ కేసు తెగడానికి ఎన్నేళ్లు పట్టునో కానీ.. దాయాదుల మధ్య యుద్ధం అనే మాట తలెత్తేది కాదేమో! పాండవుల తరపు లాయర్ గట్టివాడైతే.. ఇరువురి సమస్య పరిష్కారమయ్యే వరకు కౌరవులు కూడా రాజ్యపాలన చేయకూడదని స్టే తెచ్చి ఉండేవాడేమో. అప్పుడు కౌరవులు కూడా రాజ్యాధికారానికి దూరమయ్యే వారు. ఈ క్రమంలో వీరి మధ్య సులువుగా సంధి చేసుకునే అవకాశం వచ్చి ఉండేదేమో! లేదంటే ఇప్పటిలాగా తమ ఆస్తుల కోసం వారసులమంటూ కోర్టుల్లో కేసులు నడిచినట్టు.. అప్పట్లో కౌరవులు, పాండవుల వారసుల వరకు కేసు నడిచేదేమో! అన్నింటికంటే ముందు జూదం ఆడినందులకు అటు కౌరవులు, పాండవులపై కోర్టులు ఎలాంటి చర్యలు తీసుకునేవో? అందులో ఒక మహిళను(ద్రౌపది) పణంగా పెట్టి.. జూదం ఆడిన ధర్మరాజుకు ఎలాంటి శిక్ష పడేదో? కౌరవుల తరపున శకుని, పాండవుల పక్షాన కృష్ణుడు లాయర్లుగా వ్యవహరించే వారేమో! ఆఖరికి ఆ రాజ్యమంతా ప్రభుత్వానికే చెందుతుందని అప్పటి కోర్టులు తీర్పునిచ్చేవో?
