
ప్రజలు గమనిస్తున్నారు!
ఇది రాజకీయ నాయకులందరి తలలో మాట!
‘ప్రజలు గమనిస్తున్నారు..’ ఈ మాట రాజకీయ నాయకుల నాలుకల మీద నిత్యం నాట్యమాడుతూనే ఉంటుంది. ఏ వేదిక దొరికినా.. పరాయి పార్టీలను ఉద్దేశించి పదేపదే పలుకుతూనే ఉంటారు. నిజానికి వారు చెప్పింది నిజమే. నాయకులు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను అందరూ గమనిస్తూనే ఉంటారు. ప్రజలతో నాయకులు మాట్లాడే తీరును పరిశీలిస్తూనే ఉంటారు. నాయకులపై వచ్చే ఆరోపణలను, పత్రికల్లో వచ్చే కథనాలు, వార్త ఛానళ్లలో ప్రసారమయ్యే కథలను ఆలకిస్తూనే ఉంటారు. పదవువల కోసం నాయకులు పడే పాట్లను చూస్తూనే ఉంటారు. కాంట్రాక్లర్ల వద్ద కమీషన్లకు కక్కుర్తిపడే నేతల తీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. బినామీల పేరిట ఆస్తులు దాచుకోవడాన్ని లెక్కగడుతూనే ఉంటారు. తమ అనుయాయులకు అందించే పథకాల అమలును పసిగడుతూనే ఉంటారు. కబ్జాదారుల ముసుగులో భూ ఆక్రమణలకు తెగబడే నాయకుల తీరును అంచనా వేస్తూనే ఉంటారు. పోలీసులను ఉసిగొల్పి అమాయక ప్రజలకు అన్యాయం చేసే నాయకుల కుతంత్రాలను కనులారా చూస్తూనే ఉంటారు. ప్రైవేటు ధీటుగా అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలు, విద్యా విధానాలను పరీక్షిస్తూనే ఉంటారు. నాయకుల పోకడలను అనుక్షణం తెలుసుకుంటూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుదామనుకుంటారు. తీరా.. నాయకుల మాయ మాటలకు, ఉచిత హామీలకు బోల్తా పడుతూనే ఉంటారు. నాయకులు కుమ్మరించే గాంధీతాత నవ్వులకు గమ్మున ఊరుకుంటారు. గాజుసీసాల వాసనకు గింగిరాలు పడుతుంటారు. మళ్లీమళ్లీ అదే నాయకులను ఎన్నుకుంటారు. మళ్లీ మళ్లీ గమనిస్తూనే ఉంటారు.. గప్‌చుప్‌గా గుడ్లప్పంగించి చూస్తూనే ఉంటారు.
– జి.నమస్తే.
