దేశంలో ‘న్యాయ’పాలన!
కోర్టులు చెప్పేదాక కళ్లు తెరవలేకపోతున్న పాలకులు
న్యాయపాలన అంటే న్యాయమైన పాలన అని కాదు. కోర్టులు ఆదేశిస్తే గానీ పాలకులు తేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల గుర్తింపు కార్డుల జారీని సైతం న్యాయస్థానాలు ఆక్షేపిస్తే గానీ సరిదిద్దుకోలేని దుస్థితిలో మన వ్యవస్థలు పని చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రతీ అంశమూ కోర్టుకెక్కుతున్నదనే అనిపిస్తోంది. మొన్నటికి మొన్న పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే గానీ.. శాసనసభకు చీమకుట్టలేదు. దేశీయ సర్వోన్నత న్యాయస్థానం సుత్తిపట్టి బల్లకొడితే.. ఆ పదిమంది ఎమ్మెల్యేలకు తాఖీదులు జారీ అయ్యాయి. వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సందిగ్ధమే. ఇక పోతే.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూనే ప్రభుత్వం.. కంచ గచ్చిబౌలిలో వనసంపదను తెగ నరకబోతే భారతీయ కోర్టు కలగజేసుకుంటే గానీ.. సర్కారు చేతులు కాలలేదు. సుప్రీంకోర్టుకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా హైకోర్టు ఆదేశాలను అనుసరించాల్సి వస్తోంది. అది కూడా కోర్టులు చెబితే తామెందుకు వినాలే అన్నచందాన.. నిప్పుల మీద నీళ్లు చల్లిన రీతిన నత్తనడకన ఎన్నికల కసరత్తు నడుస్తున్నది. కనీసం.. విద్యా, ఉద్యోగరంగంలోనైనా ప్రభుత్వాలు న్యాయబద్ధంగా నడుచుకుంటాయంటే అదీ లేదు. గ్రూప్‌1 పరీక్షల నిర్వహణలో లోపాలను కోర్టు చెబితే గానీ.. పాలకులు గుర్తించలేని దయనీయ స్థితిలో ప్రజల కోసం.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పనిచేస్తుండడం గమనార్హం. పొరుగు దేశంలో ప్రభుత్వం సక్రమంగా పనిచేయడం లేదని ఏకంగా ఆర్మీయే పాలన పగ్గాలను అందుకున్నట్లుగా.. భారతదేశంలో భవిష్యత్‌లో కోర్టులే పాలన సాగిస్తాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

– జి.నమస్తే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *