
ఉద్యోగాలకు ఇన్ని పరీక్షలా?
వీళ్లు పాలకులా? వాళ్లు అధికారులా?
ఒక్క ఉద్యోగం.. దాదాపు ముప్పై ఏళ్లు.. పుస్తకాలతో కుస్తీ పట్లు.. స్కూలు ఫీజులు, కాలేజీ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, కోచింగ్ ఫీజులు, పరీక్ష ఫీజులు.. చివరకు కోర్టు చుట్టూ తిరిగితే ఉద్యోగాలు లభించని దుస్థితి నెలకొనడం విస్మయం కలిగిస్తోంది. తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కాలని, మంచి జీవితం గడపాలని.. అప్పులు చేసి.. ఆస్తులు కుదవబెట్టి.. లేక అమ్ముకుని ఫీజులు కట్టిన తల్లిదండ్రులకు కలుగుతున్న సంతోషమేదీ? ఆఖరికి ఉద్యోగాల కోసం.. కోర్టుకెక్కిన తమ పిల్లలకు లాయర్ల ఫీజులు కట్టేలా నేటి ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క టీచర్ ఉద్యోగానికి.. టీచర్ ట్రెయినింగ్ విద్య పూర్తి చేయాలి. అందులో ఉత్తీర్ణతకు పరీక్ష రాయాలి. ఆ తర్వాత టెట్ రాయాలి. ఆపై డీఎస్సీలో మెరిట్ సాధించాలి. ఒక పంతులు నౌకరీకి ఇన్ని పరీక్షలా? అదే ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే, ఎన్ని పరీక్షలు పెడుతున్నారు? గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. పరీక్షలు నిర్వహించే.. అధికారులు కూడా కష్టపడి పరీక్షలు రాసే కదా? ఉద్యోగాల్లో చేరింది. ఒకసారి నిర్వహించిన పరీక్ష.. రద్దయితే ఆ పరీక్ష రాసిన వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో లోపాలకు అసలు కారకులు అధికారులా? పాలకులా? తేలాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, విద్యార్థిలోకం కూడా జరుగుతున్న పరిణామాలను అవలోకించి.. నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధులనే చట్టసభల్లోకి పంపించేందుకు ఇప్పటికైనా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించాలి. లేదంటే.. జీవితమే పరీక్షగా మారే ప్రమాదంలో పడిపోతామేమో?!
-నమస్తే.
