
మహిళ రిజర్వేషన్లు రికార్డులకే?
పేరుకే అతివలు.. పెత్తనమంతా మగవారిదే కదా?
ఆడవారికి ఎందుకు పొలిటికల్ రిజర్వేషన్లు! కేవలం మీటింగ్లకు, సంతకాలకు తప్ప వారు ఒరగబెట్టేదేముంది. మహిళలు రాణించాలని అనుకోవడం తప్ప.. ఆచరణలో సాధ్యమవుతున్నదా? గెలిచాక.. భర్తలదే పెత్తనం. మహిళా సర్పంచ్ పేరుకు చివరన భర్త పేరు లేనిదే.. చలామణి కాదు. లేదంటే.. సదరు భర్త అగ్గి మీద గుగ్గిలమే. అంతేకాదు, గెలిచిన మరుసటి రోజు నుంచే.. సదరు భర్త తానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీనంటూ చెప్పుకుని తిరిగేవారు లేకపోలేదు. ఆఫీసుల్లోనూ వీరిదే పెత్తనం. ఊళ్లో పంచాయితీలకు కూడా వారే పెద్దమనుషులు. ఇక ఆడవారి పెత్తనం ఎక్కడుంది? అలాంటప్పుడు మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఎందుకు? సమావేశాలప్పుడు పదవి పెండ్లానిది.. పెత్తనం పెనిమిటిది? అని రాసుకోవడానికా? మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు.. పదవి ఒక్కటే కాదు, పెత్తనం కూడా వారే చలాయించేలా ఆదేశాలు ఉంటేనే రిజర్వేషన్లకు న్యాయం చేసినట్లవుతుంది. లేదంటే.. రికార్డుల్లో రాసుకోవడానికే ఆడవారి రిజర్వేషన్లు పరిమితమవుతాయి.
– నమస్తే
