
రెడ్డోడు.. బలిసినోడ్ర!
ఓటుకు డబ్బులిస్తడు!!
ఎలుమోడు ఎక్కువనే ఇస్తడు!
శాలోడు, గొల్లోడు ఏమిత్తడ్ర!!
ఇదీ నిమ్న, బిసి వర్గాల ఓటర్ల అభిమతం?
నిజానికి ఎన్నికల పర్వంలో ఇదే విధంగా జరుగుతుందనడానికి సందేహం అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా ముందుగా తన కులానికి సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయో లెక్కలేస్తాడు. వారిలో సగం మంది ఓట్లేసినా.. ఇంకొన్ని వేరే వాళ్లు వేయకపోతారా? అనే ఆశతోనే రంగంలోకి దిగుతాడు. మరి.. అలా జరుగుతుందా? అంటే ఫలితాలు వస్తేగానీ.. ఓటర్ల నాడి పసిగట్టలేని పరిస్థితి. ఫలితాల తర్వాత తనకు ఓట్లు వేయలేదని తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవకు దిగిన అభ్యర్థులు లేకపోలేదు. వాస్తవానికి ఒక పద్మశాలీ.. తన కులపోళ్లపై నమ్మకంతో పోటీలోకి దిగితే.. ‘శాలోడు ఏమిత్తడ్ర..’ అని కొందరు.. ‘వాడు గెలిస్తే.. వాని స్థాయి పెరుగుతుంది’ అని సొంత కులపోళ్లే పోలింగ్ రోజున బోరెం కోసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉంటాయి. ఈ పరిస్థితి ఒక్క పద్మశాలీ కులస్తుల్లోనే కాదు.. దాదాపు అన్ని కులాల్లో ఉంటుంది. రెడ్డోడు గట్టోడనో.. ఓటుకు డబ్బులు ఇస్తాడనో? వెలమోడు ఓటుకు ఎక్కువ ఇస్తాడనో ఇప్పటికీ అంచనాలు వేసే వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో కులాల నిచ్చెన పట్టుకుని రాజకీయ చెట్టు ఎక్కుదామనుకుంటే.. కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదినట్టే అవుతుంది. అందుకు బీసీరాగంతో ఎన్నికల బరిలోకి దిగిన వారి పరిస్థితులే నిదర్శనం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. విద్యావంతులు, బోధకులు.. అన్ని తెలిసిన వారే.. బీసీ నినాదాన్ని పక్కన పెట్టి.. రెడ్డి వర్గానికి పట్టం కట్టారు. అలాంటిది ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారని అంచనాలు వేసుకునే సామాన్య ఓటర్లు.. కులాలకు ప్రాధాన్యమిస్తారనుకోవడం అతి నమ్మకమే అవుతుంది.
– నమస్తే.
