
ఇదీ విలువైన స్నేహం!
ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా టెన్త్ క్లాస్ మేట్స్
రోజు కలుసుకునే స్నేహితులు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం సాధారణం. ఎప్పుడో స్కూల్లో చదువుకున్న మిత్రుడు.. ఆపదలో ఉన్నాడని తెలవగానే అండగా నిలవడం అసాధారణం. అదే స్నేహం గొప్పతనం. అలాంటిదే.. హన్మకొండ
జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1995-96 బ్యాచ్ విద్యార్థుల మధ్య స్నేహ హస్తం పరుచుకుంది. ఆ బ్యాచ్ లో ఒకరైన రాజోజు రామచంద్రాచారి నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి లో చేరాడు. ఈ రోజుల్లో వైద్యం అంటే ఖర్చు ఎలా ఉంటుందో తెలియంది కాదు. రామచంద్ర చారీ కూడా తాను కోలుకోవడానికి చేతిలో ఉన్నదంత ఖర్చు చేశాడు. ఈ క్రమంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టెన్త్ క్లాస్ మిత్రులు అతడికి అండగా నిలిచారు. రూ.40 వేలు పోగు చేసి రామచంద్ర చారి కుటుంబానికి అంద జేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటూ స్నేహమంటే కలిసి నవ్వుకోవడమే కాదు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అని నిరూపించినందుకు మిత్రులందరికీ రామచంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అన్న మహేందర్, బుస్స శ్రీనివాస్, ఏదుల మనోహర్ , డి.సంజీవరావు, పైండ్ల శంకర్ ఐలి సురేందర్, కోకిల బిక్షపతి, కోగిల చంద్రమౌళి, బత్తుల వీరభద్రమ్ తదితరులు పాల్గొన్నారు.
