
తాగడానికి ఒక కారణం!
తాగించడానికీ అదే సాకు!!
ప్రజల్లో నాటుకున్న నమ్మకం, ఆచారం
ఏమైందిరా.. ఇప్పుడెందుకు తాగావ్.. ఏదో ధైర్యం కోసం ఒక పెగ్గు తాగాను.. అని చెప్పేవారు అందరికీ తారసపడే ఉంటారు. మందు తాగడానికే కాదు.. తాగించడానికి కూడా అది ఒక కారణంగా కొనసాగుతూనే ఉంది. ఏదైనా పంచాయితీ ఉన్నా, పది మందిలో గట్టిగా మాట్లాడాలనుకున్నా, కోర్టు కేసులకు అటెండ్ కావాలన్నా, పోలీసుల వద్దకు వెళ్లాలన్నా.. ఆస్పత్రుల్లో తమ వారిని పరామర్శించేందుకు వెళ్లాలన్నా.. ఒక పెగ్గు పేరిట.. ఫుల్లు లాగించే వారు చాలామందే ఉంటారు. అంతేకాదు, అలాంటి వారికి తాగించే వారు కూడా ఇదే కారణంతో ఒక పెగ్గు అంటూ ఒక్కొక్కరుగా మందు ఆఫర్ చేస్తుంటే.. అదీ ఫుల్లు దాటిపోతుంది. సంతోషం పెరిగినా, బాధ కలిగినా.. పెగ్గు దిగనిదే.. పెగ్గు పోయించనిదే.. మాట, మర్యాదకు తావులేని పరిస్థితులను అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా చనిపోతే.. అతడి వారసులకు ‘కడుపు చల్లబరచడం’ అనే ఒకే ఒక్క ఆచారంతో బంధువులంతా కలిసి.. మద్యం ఆఫర్ చేయడం సర్వసాధారణమే. ధైర్యమో.. గుండె నిబ్బరమో.. ఏదైనా మద్యంతోనే మర్యాద.. మద్యంతోనే మాటల యుద్ధం! అదీ మద్యం మహిమ!
– నమస్తే.
