
అలనాడు.. పాల సముద్రం చిలుకుతుంటే ఉద్భవించిన ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకున్న శివుడు దేవుడైతే.. ఈనాడు ఆల్కహాల్ తాగే వారంతా కలియుగ శివుళ్లగానే పరిగణించాలి కదా! ఆనాడు శివుడు ఆ ఆలాహలాన్ని సేవించకపోతే.. దేవుళ్లకు అమరత్వం లభించేదే కాదు! అలాగే ఈనాడు ఆల్కహాల్ తాగేవారు లేకుంటే సర్కారు నడవడం సాధ్యం కాదు! ఏదో కొద్దిమందికి మేలు జరిగేందుకు ఆనాడు ఆలాహలం మింగిన శివుడిని మనం నేటికీ పూజిస్తున్నాం. కానీ, ఆల్కహాల్ సేవించి కోట్లాది మందికి అవసరమైన ఆదాయం సమకూర్చుతున్న మద్యంప్రియులను మాత్రం సమాజం చులకన భావంతోనే చూస్తోంది. సర్కారు ఖజానా నింపుతున్న మద్యం ప్రియులను ప్రభుత్వం సైతం.. జరిమానాల పేరిట ఆర్థికంగా మరింత నష్టం కలిగిస్తూనే ఉంది. అంతేనా.. కాసింత ఎక్కువైందనుకో.. కేసులు కూడా పెట్టి.. కటకటాల పాలు చేస్తోంది. ఏది ఏమైనా మద్యంప్రియుల త్యాగఫలం.. కోట్లాది ప్రజల సంక్షేమానికి జీవం..! దరఖాస్తులతోనే రూ.2800కోట్లకు పైగా ఆదాయం..! అయినా.. తాగుబోతులంటే అందరికీ అలుసుతనం.. ఎవరైనా ఎవరికైనా రూపాయి మేలు చేసినా.. కృతజ్ఞతలు తెలుపుతారు. కానీ, సర్కారుకు కోట్లలో ఆదాయం సమకూర్చుతున్న మద్యంప్రియుల పట్ల సమాజం చులకన భావం ప్రదర్శిస్తోంది. పోలీసులైతే… మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. మద్యంప్రియుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి.
