
రూపాయే సిపాయి!
ప్రాణం పోసేది.. ప్రాణం తీసేదీ అదే!!
రూపాయి.. ప్రపంచాన్ని నడిపిస్తున్నది అదే. తల్లిగర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి మరణించాక పిండం పెట్టేవరకు అంతా డబ్బుతోనే పని. గర్భంలో ఉన్న పిండం ప్రాణంగా ఈ లోకంలోకి రావాలంటే రూపాయి ఖర్చు చేయాల్సిందే. పుట్టాక బతుకు సాగించడానికి ప్రతీ రూపాయి అవసరమే. ఆ అవసరాలకే అవసరమైతే ప్రాణం తీసేది, తీయించేది రూపాయే. ఒకరిని మోసం చేయాలన్నా రూపాయే కారణం. భార్యభర్తల మధ్య బంధం ముడిపడాలన్నా రూపాయే. తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం కొనసాగాలన్నా రూపాయే. ప్రభుత్వాలు పనిచేయాలన్నా రూపాయే. ఆఫీసుల్లో ఫైళ్లు కదలాలన్నా రూపాయే. ఇల్లు నిలబడాలన్నా రూపాయే. ఇల్లు కూల్చాలన్నా రూపాయే. తాగేనీళ్లకు రూపాయే. తినే తిండికీ రూపాయే. పడుకున్నా రూపాయే. నిద్రలేచినా రూపాయే. గుళ్లో రూపాయే. బళ్లో రూపాయే. ఆఖరికి చితి కాలాలన్నా రూపాయే. రూపాయి లేనిదే మనిషి జీవనమే లేదు. అందుకే మనిషిని పుట్టించేది రూపాయే. రోగమొస్తే కాపాడేది రూపాయే. రూపాయి కోసం చంపేది రూపాయే. రూపాయే ఈ ప్రపంచంలో మొదటి సిపాయి. మనలను కాపాడినా.. వెన్నుపోటు పొడిచినా.. చివరకు కాలగర్భంలో కలిపినా.. రూపాయే కారణ‘భూతం’!
