
బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో నిజమని తేలింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనకాల నడిచిన, నడిచే స్థాయి. ఇప్పుడు కలం కలిసొచ్చి తెలంగాణకు సీఎం అయ్యారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబుతో కరచాలనం చేసే స్థాయికి చేరుకున్నారు. అయితే అంతటి స్థాయికి చేరుకోవడానికి రేవంత్ రెడ్డి ఎన్నో కష్టాలు పడ్డారు. తెలంగాణలో బిఆర్ఎస్ పాలన సమయంలో జైలుకు కూడా వెళ్లారు. నక్క తోకను తొక్కినట్లు ఇప్పుడు తెలంగాణకు సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి… ఆ పార్టీ సీనియర్లను వెనక్కు తోసి సీఎం కావడం గమనార్హం. ఇదంతా ఆయన అదృష్టంగా భావించినా ఆ దిశగా నేటి యువత ప్రయత్నించక పోవడం విచారకరం. రాజకీయాలంటే అదో బురద గుంత అని అనుకొని దూరంగా ఉంటున్నారే కానీ ఆ బురదను తొలగించుదామని అనుకోవడం లేదు. ఫలితంగా దశాబ్దాలుగా ఒకే తరం నాయకులు పాలకులు అవుతున్నారే తప్ప కొత్త తరం నాయకత్వం పుట్టుకు రావడం లేదు. ఇప్పటికైనా యువత మేలుకొని ఇతర రంగాలపై ద్రుష్టి సారించినట్లుగా రాజకీయాలపైనా ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
