
నేతలే వీఐపీలా!
రాతగాళ్ళు కాదా?
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రిక (మీడియా) వ్యవస్థలను భారత ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలుగా చెబుతుంటారు. ఈ మేరకు ఆయా వ్యవస్థలకు సమాజంలో తగిన ప్రాధాన్యం కల్పించ బడుతుందని అంటుంటారు. అయితే ఆ ప్రాధాన్యం కేవలం మొదటి మూడు వ్యవస్థలకు లభిస్తున్నదనే వాదనలు లేకపోలేదు. వాస్తవానికి ఈ నాలుగు వ్యవస్థలు వేటికి అవి స్వతంత్రంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మొదటి మూడు వ్యవస్థలు నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా వ్యవస్థను శాసిస్తున్నాయని అందరికీ తెలిసిందే. పత్రికా రంగానికి స్వేచ్ఛ ఉండాలంటూనే వాటి చేతులను, గొంతుకలను కట్టి పడేస్తున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ప్రజలకు వాక్కు స్వాతంత్య్రం కూడా రాజ్యాంగం కల్పించింది. కానీ తమకు జరిగిన, జరుగుతున్నఅన్యాయాలపై ప్రశ్నించే సాధారణ ప్రజానీకాన్ని సైతం మొదటి మూడు వ్యవస్థలు శాసిస్తున్నాయి. అంతెందుకు ఆ మూడు వ్యవస్థలు సమాజంలో వీఐపీ, వీవీఐపీ వ్యవస్థలుగా చలామణి అవుతున్నాయి. చివరకు ఓ వార్డు సభ్యుడికి, ఓ గల్లీ లీడర్ కు అందుతున్న గౌరవం కూడా మీడియా రంగంలో అందరికి దక్కడం లేదనేది నిర్వివాదాంశం. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అటెండరుకు, పోలీస్ స్టేషన్లో పని చేసే హోమ్ గార్డుకు గుడి, బడితో పాటు ఇతర చోట్లా లభించే కనీస మర్యాదలు కూడా మీడియా రంగంలో అందరికి దక్కడం లేదని నిర్ద్వందంగా చెప్పొచ్చు. జర్నలిస్ట్ అంటే.. ఏ పేపర్? ఎప్పుడు చూడలేదు? అని అడిగే పోలీసులను, నాయకులను, అధికారులను అలాగే ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు అయితే ఏకంగా అలా అడిగిన వారిపైనే కేసులు పెట్టిన సంఘటనలు లేకపోలేదు. ఒక నాయకుడి గురించి వార్తలు ప్రచురితం అయితే కోర్టులను ఆశ్రయించి పరువు నష్టం వేస్తున్న నాయకులు జర్నలిస్టులను కించ పరిస్తే.. అడిగే దిక్కు లేకుండా పోతోంది. అయితే మొదటి మూడు వ్యవస్థలు ఇక్కడ ఒకదానికి ఒకటి రక్షణ కవచంగా నిలుస్తున్నట్లు సుస్పష్టంగా అర్థమవుతోంది. అందుకు పత్రికలూ, మీడియాలో వచ్చే కథనాలకు మొదటి మూడు వ్యవస్థలు పరిగణన లోకి తీసుకోమని చెప్పడమే మీడియా వ్యవస్థ నిర్వీర్యానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ పరిస్థితులు మారిన రోజే ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద నడుస్తుంది. సమాజం మెరుగు పడుతుంది. ధర్మము కానీ, న్యాయం కానీ అందరికి దక్కుతాయి.
