ఆ మాటకు పవర్ ఉంటే నాయకులు అందరికీ ఆశ కురుపులే!
ఏదైనా ఇస్తానని ఇవ్వకుంటే ఆశ కురుపులు అవుతాయని ఒకప్పుడు అనుకునే వారు. ఇప్పుడు ఈ వాక్కు అంతగా ప్రాచుర్యంలో లేకపోవచ్చు కానీ, ఒకవేళ ఈ మాట అందరి నోటా నానుతూ ఉండి.. ఆ మాటకు అంత శక్తే ఉండి ఉంటే మాత్రం రాజకీయ నాయకులందరి కళ్లకే కాదు.. ఒంటి నిండా ఆశ కురుపులు వచ్చి ఉండేవేమో! గడిచిన 12 ఏళ్ల కాలంలో గల్లీ నాయకులు కూడా ప్రజలను తమ మాటలతో నిరాశలో ముంచుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులకు అణువణువునా ఆశ కురుపులు అయ్యేవేమో! తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎస్సీలను ముఖ్యమంత్రిని చేస్తానని ఆ వర్గానికి ఆశ పెట్టింది. నిరుద్యోగ భృతి ఇస్తానని యువతలో ఆశలు రేపింది. ఇంటికో ఉద్యోగం అని ఆశ చూపింది. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ఆశ పుట్టించింది. పదేండ్లు పాలించి పంగనామాలు పెట్టింది. ఈ లెక్కన ఆ నాయకులకు ఒంటి మీద సందు లేకుండా పుండ్లు కావాల్సిందే. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రెండేండ్లు కాలం గడిపింది. మిగతా మూడేండ్లలో ఇస్తదని గ్యారంటీ లేదు. ఆశ కురుపులు నిజమే అయితే ప్రస్తుతానికి వీళ్ళ కళ్ళకు, చేతులకు పుండ్లు కాక తప్పదు. ఇక ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలామంది వచ్చి రానీ హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా కలిసి ఆశ కురుపుల వాక్కు ఫలించాలని దేవుడిని కోరుకుంటే.. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చేందుకు నాయకులు భయపడతారు. లేదంటే ప్రజలకు నాయకుల నుంచి ఎల్లకాలం నిరాశలు తప్పవు.