• సమాజాన్ని శాసిస్తున్న నోట్ల కట్టలు
  • ఈ లోకంలో సర్వం డబ్బుమయమే
  • అవినీతి, అక్రమాలకు మూలం
  • ధనమే మనిషి పుట్టుక నుంచి చావు వరకు డబ్బే
  • డబ్బుతోనే ఎవరికైనా హోదా, గౌరవం..
    డబ్బు.. ఎంతటి పని అయినా చేయిస్తుందంటారు. ఒక వ్యక్తిని చంపాలన్నా, చావు నుంచి రక్షించాలన్నా డబ్బే ప్రధాన వనరుగా మారింది. వ్యక్తిని చంపేవారు డబ్బు కోసమే ఆ పని చేస్తున్నారు. వ్యక్తిని చంపించే వారు కూడా డబ్బు లేదా ఆస్తి కోసమే హత్యలు చేయిస్తున్నారు. డబ్బు కోసమే మోసాలు, ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయని క్రైం నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనిషి పుట్టుక నుంచి చావు వరకు డబ్బే ముఖ్యంగా మారింది. గౌరవం, పరపతి, హెూదా ఒక వ్యక్తికి దక్కాలంటే డబ్బు తప్పనిసరి. ఆ డబ్బే లేకుంటే నిరుపేద, ఉంటే ధనికుడు. డబ్బే మర్యాద, డబ్బే బేమర్యాద. డబ్బును చూసే నాలుక తీపెక్కుతుంది. డబ్బు అనే మాట వినపడగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి. కళ్లు విప్పారుతాయి. ఒళ్లు పులకరిస్తుంది. కాళ్లు, చేతులు కదలాడుతాయి. డబ్బు కోసం బిచ్చగాళ్లు.. డబ్బు కోసమే చిల్లర, చిచోర పనులు. డబ్బు కోసమే వలసలు. డబ్బు కోసమే పెళ్లిళ్లు. డబ్బు కోసం దవాఖానాలు, డబ్బు కోసమే వ్యాపారాలు, డబ్బు కోసమే బ్యాంకులు, సర్వం డబ్బు కోసమే.. డబ్బు కోసమే అవినీతి.. అక్రమాలు. డబ్బు కోసమే ఎన్నికలు, ఓట్లు. డబ్బు ఉన్నవారే పెద్దలు, డబ్బు లేనివారే పేదలు. డబ్బు కోసమే పూజలు, డబ్బు కోసమే దొంగ పూజలు. డబ్బే న్యాయం.. డబ్బే అన్యాయం. డబ్బే ఒక పెద్ద జబ్బు.. ఆ జబ్బులకు మళ్లీ డబ్బులు.. డబ్బు కోసమే యుద్ధం, డబ్బు కోసమే మరణం. డబ్బే డబ్బు.. అంతా డబ్బు.. డబ్బుతోనే డబ్బు వ్యాపారం. కూడబెట్టుకోవడానికి డబ్బు. దోచుకోవడానికి డబ్బు. కేసులు పెట్టడానికి డబ్బు. కేసుల నుంచి బయట పడడానికి డబ్బు. నిజం చెప్పడానికి డబ్బు. అబద్ధం చెప్పడానికి డబ్బు. అంతా డబ్బుమయమే. అందుకే డబ్బునే నిషేధించాలి. పూర్వం వస్తుమార్పిడి విధానాన్ని తీసుకొస్తే.. డబ్బుతో పని ఉండదు. అవినీతికి ఆస్కారం ఉండదు. అక్రమాలకు తావుండదేమో!