కేసులతో కోర్టు సమయం వృథా కాకుండా ఉంటుంది
తెలంగాణ పార్టీ ఫిరాయింపుల అంశంపై రాజకీయ వివాదంగా మారింది. శ్మశానం ముందు ముగ్గుండదు.. రాజకీయ నాయకులకు సిగ్గుండదు.. అనే మాటలను నిజం చేస్తున్నట్లుగా కొందరు ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏ దొడ్డిలో ఈనితే ఏముంది? మా దొడ్డిలో కట్టేసుకుంటాం.. అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని మరో పార్టీ చేర్చుకోవడం.. రాజకీయ వ్యభిచారంగా పేర్కొంటున్నారు. పార్టీ సిద్ధాంతాలను పరిహసిస్తున్నారు. తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే పడుపు వృత్తి అన్నట్లుగా వ్యవహరిస్తున్న మరో వర్గం.. ఈ విషయాన్ని బజారుకెక్కి ఇళ్లెక్కిన కోడి అరిచినట్లు అరుస్తోంది. న్యాయం బతకాలంటూ కోర్టుకెక్కింది. ఇప్పటికే సవాలక్ష కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రజాప్రతినిధిగా విస్మరించి.. అగ్గనగల్ల ఈ పంచాయితీ తేల్చాలని కనపడిన కోర్టుమెట్లన్నీ ఎక్కుతోంది. ఐదేళ్లయితే ఊడిపోయే పదవిలో మోసం జరుగుతోందని గగ్గోలు పెడుతూ విలువైన కోర్టుల సమయాన్ని వృథా చేస్తున్న నేతలు.. సమాజంలో అవినీతి, అక్రమాలను అరికట్టడంపై పెదవి విప్పకపోవడం నేటి సంకుచిత రాజకీయాలకు నిదర్శనం. ఇలా ఏ ఎండకు ఆ గొడగు పట్టే రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే.. పార్టీ గుర్తులతో కాకుండా అందరినీ ఇండిపెండెంట్లుగానే గుర్తించి.. ఎన్నికల రంగంలోకి దింపడమే సరైన మార్గం. లేదంటే.. రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అన్నట్లు.. ఊసరవెల్లి రంగులు మార్చిన చందాన.. ఈ రాజకీయ నాయకులు పూటకో పార్టీ.. పేటకో జెండాపట్టుకుతిరుగుతుంటారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి తప్పా.. ఉన్నత హోదాలో ఉన్న మరో రాజకీయ నాయకుడిని తీర్పు కోరడం దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లే అవుతుంది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం, ఎన్నికల సంఘం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోను పార్టీల జెండా నీడన కాకుండా.. స్వత్రంత్రంగా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీదారులను గుర్తించి.. నిర్వహిస్తే.. ఏ నాయకుడి సత్తా ఏంటో ఇట్టే తేలిపోతుందేమో!