
లీడర్లు కాదు.. లెక్చరర్లు!
- రాజకీయ ప్రసంగాలతో అధ్యాపక అవలక్షణాలు
- తెలంగాణలో పెరుగుతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు
లెక్చరర్లు, ఉపాధ్యాయులు లీడర్లుగా మారడం చూశాం. లీడర్లే లెక్చరర్లుగా మారడం తెలంగాణ రాజకీయాలకే చెల్లుతుందేమో! సాధారణంగా లీడర్లు అంటే ఉపన్యాసాలు దంచికొడతారనే అందరికీ తెలుసు. కానీ, పదేళ్లుగా తెలంగాణలో పాఠాలు చెప్పడం పరిపాటిగా మారుతోంది. కేసీఆర్ సీఎం అయిన నాటి నుంచి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై తరచూ డిజిటల్ క్లాసులు నడుస్తున్నాయి. ప్రభుత్వం మారిన ఈ తరగతులు మాత్రం ఆగడం లేదు. ప్రజలకు నిజాలు తెలియాలని ఒక వర్గం, ప్రజలు గమనిస్తున్నారంటూ మరో వర్గం.. తెరమీద పాఠాలు తెగ చెప్పేస్తున్నారు. బడి అనగానే పలక, బలపం పట్టుకున్నట్లుగా.. నీళ్ల ముచ్చట ఎత్తగానే.. రాజకీయ వైరి వర్గాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ గోడకు తెర, చేతిలో కట్టె పట్టుకుని తిరుగుతున్నారు. ఇంతకీ ఈ విషయాలు ఎవరికి చెబుతున్నట్టో అర్థం కాని పరిస్థితి. ప్రజలు ఇప్పటికిప్పుడు నీటి పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాసేది ఉందా? లేదంటే.. పక్క రాష్ట్రంతో పోట్లాడేది ఉందా? పోనీ.. కేఆర్ఎంబీ ముందు, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన జల కమిటీ ముందు వాదించేది ఉందా? ఏం చేసినా అధికారులు, బాధ్యులుగా పాలకులే కదా? వివరించినా.. చేతులెత్తేసినా..? ప్రజలు చేసేదేముంది? తలాపున గోదారి పెట్టుకుని తాగునీటికి తండ్లాడే గ్రామాలు లేవా? ప్రజలకు పాఠాలు చెప్పడానికా ఎన్నుకున్నది.. సమస్యలు రాకుండా పాలించడానికా? - జి.నమస్తే.
