
హననం!
- ఇటీవల రాజకీయ నేతల నోట్లో నానుతున్న పదం
- చంపడం లేదా కొట్టడం దాని అర్థం
- అధికార, ప్రతిపక్ష నాయకులు అదేపనిగా వాడకం
- ఇంతకు ఎవరు ఎవరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారో?
- అసలు రాజకీయ నాయకులంటేనే సిగ్గుండదంటారు?
- అలాంటప్పుడు హననం.. మననం ఎందుకో?
- పూటకో పార్టీ మారితే హననం అనిపించుకోదా?
- హామీలను విస్మరించడం ప్రజల వ్యక్తిత్వాలను హననం చేయడం కాదా?
- అధికారులు లంచాలు తిని ఇతరులకు అన్యాయం చేయడం ఏంటో?
- భూ కబ్జాలతో బాధపడే సామాన్య ప్రజానీకం ఆవేదనను ఏమనాలో?
- అడ్డగోలుగా ధరలు పెంచితే ప్రజల మనోవ్యథకు ఏ పదం వాడాలో?
- డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారు పడే ఆందోళనకు ఏ పేరు పెట్టాలో?
వరంగల్ :
వ్యక్తిత్వ హననం.. కొన్ని రోజులుగా ఈ పదం రాజకీయ నాయకుల నోళ్లలో తెగ నానుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తమ వ్యక్తిత్వాలను హననం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి.. హననం అంటే ఏమిటి? చంపడం లేదా కొట్టడం అనే అర్థం వస్తోంది. అంటే ఒకరిపై ఒకరు చేసుకునే మాటల దాడితో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని తమకు తామే వాదించుకుంటున్నారన్నమాట. మరి.. మనోవ్యథ, మనోభావాలు, వ్యక్తిత్వాలు రాజకీయ నాయకులకే ఉంటాయా? సామాన్య ప్రజానీకానికి ఉండవా? రాజకీయాల్లో నాయకులుగా మార్చింది ప్రజలే కదా? ప్రజాప్రతినిధులను చేసింది కూడా జనమే కదా? అలాంటి నాయకులు, ప్రజాప్రతినిధులు.. ప్రజలను నిత్యం ప్రలోభాలకు గురి చేయడం హననం అనిపించుకోదా? ఇష్టారీతిగా హామీలు గుప్పించి విస్మరించడం.. హననం కాదా? రాజకీయ నాయకులు వారికి వారే దుమ్మెత్తిపోసుకుని తమకు బాధకలిగిందని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. రాజకీయ నాయకుల తీరు చూస్తుంటే.. ‘స్మశానం ముందు ముగ్గుండదు.. రాజకీయ నాయకులకు సిగ్గుండదు..’ అనే నానుడిని హననం చేసినట్లే అవుతందేమో!
ఏదైనా తనదాకా వస్తే కాని బోధపడదంటారు.. భూ కబ్జాల బారిన పడినవారు, సంక్షేమ పథకాలకు లంచాలు ఇవ్వలేని వారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారు, అడ్డగోలుగా పెరిగే ధరలతో ప్రజలు పడుతున్న బాధలను మానవ హననం అనాలేమో! విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వాలు.. ఆరోగ్య శ్రీ పేరిట కార్పొరేట్ ఆస్పత్రులకు, ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట ప్రైవేటు విద్యా సంస్థలకు కోట్లాది రూపాయలను ప్రజాధనాన్ని కట్టబెట్టడాన్ని ఆర్థిక హననం అనాలా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ రకాల సేవలకు డబ్బులు వసూలు చేయడం సేవల హననమే కదా! కొందరు పోలీసులు భూకబ్జాదారులకు అండగా నిలిచి.. అభాగ్యులకు అన్యాయం చేయడం.. న్యాయాన్ని హననం చేయడం కాదా? లంచాలకు మరిగిన అధికారుల తీరును ఏమనాలి? లంచాలు ఇచ్చుకోలేని నిరుపేదల వ్యక్తిత్వం హననం కావడం లేదా? మండిపడుతున్న నిత్యావసర సరుకుల ధరలను చూసి.. అర్థాకలితో అలమటిస్తున్న వారి మనో వ్యథ ఏ హననం కిందకు వస్తుందో? అదేపనిగా హామీలు గుప్పించి.. విస్మరించడం ఏ హననమో మరి! అర్థరాత్రి వరకు మద్యం షాపులు, బార్ షాపులకు అనుమతులు ఇచ్చి.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వేలకు వేలు జరిమానాలు వసూలు చేయడాన్ని ఏరకమైన హననంగా భావించాలో? సినిమా ఒక వ్యాపారమంటూనే అడ్డగోలుగా టికెట్టు ధరలు పెంచుకునేందుకు జీవోలు జారీ చేయడం ఏ హననం కిందకు వస్తుందో?… ఓటుకు డబ్బులు ఇవ్వడం.. రాజ్యాంగ హననం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే… ప్రజలు నిత్యం నేతలు, ప్రజాప్రతినిధుల చేతలు, మాటలతో హననానికి గురవుతూనే ఉన్నారు. మరి.. వారి హననానికి విలువే లేదా? వారి వ్యక్తిత్వానికి పరువే లేదా?!
– జి.నమస్తే.
