
అవి కేసు పెడితే.. జైళ్లు సరిపోవేమో?!
- దోమలను చంపని వారు ఉండరేమో!
ప్రకృతిలో పలు క్రిమి.. కీటకాలతో మానవులకు హాని కలిగే ప్రమాదం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. వాటిలో దోమ ఒకటి. దీని కాటుకు గురికాని వారు ఉండరేమో!! మహానగరాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వీటిని చూడని వారు ఉండరు. వీటి బాధను అనభవించని వారు కూడా లేరేమో! మురికి ప్రాంతాల్లో నివసించే వారికి వీటితో అవినాభావ సంబంధమే ఉంటుంది. అవి కుట్టడమే కాదు.. ఎవరికి వారు కొట్టుకునేలా చేసేవి ఈ సృష్టిలో దోమలు తప్ప మరో జీవి లేదేమో! దేవుని ముందు లెంపలు కూడా సుతారంగా వేసుకునే వారు కూడా.. ఒంటిపై వాలిన దోమలను పారదోలేందుకు తమను తాము కొట్టుకోవడానికి కూడా వెనుకాడరు. ఇతరులు కొట్టినా ఏం అనలేని పరిస్థితి. ఎలక్ట్రికల్ బ్యాట్లు, వివిధ రకాల రసాయనిక మందులు ఉన్నా.. మున్సిపాలిటీ సిబ్బంది పొగమందు వెదజల్లినా.. దోమల బెడద మాత్రం ప్రజలకు తప్పడం లేదు. ఆ బాధ ఒక మానవులకే కాదు.. పశువులకు కూడా ఉంటుంది.. కానీ.. అవి చెప్పుకునే అవకాశం లేదు. మానవుల్లా తమను తాము కొట్టుకునే పరిస్థితి లేదు. కాకపోతే.. తోకతో దోమలను పారదోలే ప్రయత్నం చేయడం తప్పు.. మరో ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. ఇకపోతే కొన్ని జీవులను చంపడం నేరంగా పరిగణిస్తుంటారు. ఆ కోవలో దోమ కూడా చేరిందనుకో.. జైళ్లు సరిపోవేమో! ఏమైనా గడ్డిపోచ కూడా ఏనుగు బంధిస్తుందన్నట్టు.. మానవుని బరువు, పరిమాణంలో ఈసమెత్తు కూడా లేని దోమలు.. తమను తాము కొట్టుకునేలా చేయడమే కాదు.. ఒక్కోసారి మంచం పట్టిస్తాయి.. మరణ శాసనం కూడా రాస్తాయి.. అందుకే ప్రకృతిలో ఏజీవిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. దేని బలం దానిదే. దేని ప్రభావం దానిదే! ఇకపోతే.. దోమల సంతతిని అరికట్టడం అసాధ్యమే..! కుక్కల సంతతిని అరికట్టడానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది కానీ, ఈ దోమలకు కు.ని. చేసే అవకాశం లేదు.. రాదేమో కూడా! భూమి మీద జీవులు ఉన్నంతకాలం.. దోమల బెడద తప్పించుకోవడం తప్పు. మరో మార్గం లేదు. ఆనాడు.. మహాభారతంలో ధర్మరాజు.. దోమ గొంతులో పడి అశ్వథ్థామ అనే ఏనుగా చనిపోయిందని.. అబద్ధం ఆడాడేమే గానీ.. నేడు దోమ కుడితే మరణించే వరకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దోమే కదా అని లైట్ గా తీసుకుంటే.. ఆస్పత్రుల్లో చేరి ప్రాణాలతో ఫైట్ చేసిన వారు చాలామందే ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు కుక్కల బెడద నుంచి కంటే ముందు దోమల నుంచి ప్రజలను రక్షించడంపై ప్రధాన దృష్టి సారించాలి. వారానికోసారి పొగమందు కొడుతున్నామని కాకుండా.. పూర్తిస్థాయిలో నివారణ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.
– జి. నమస్తే.
