ప్రహసనంగా మారిన ఎన్నికల తంతు!
ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఆ హక్కు అభాసుపాలవుతోంది. వెయ్యికి, రెండు వేలకు అమ్ముడవుతోంది. కాదు.. రాజకీయ నాయకులే ప్రజలను మభ్యపెట్టి బేరం పెడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రజాప్రతినిధులే కాలరాస్తున్నారు. ఏకంగా కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. అయినా.. ఓటర్లనే కాదు, ఏకగ్రీవం ముసుగులో పోటీదారులనే కొనే స్థాయికి ఎన్నికల పర్వం చేరుకుంది. ఒక ఓటరు కూడా డబ్బులు వచ్చిందే ‘గుర్తు’గా వేలిమీద ఓటు ‘గుర్తు’ వేయించుకుంటున్నాడు. ఎన్నికల సంఘం కూడా ఈ ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చుకుంది. ఎక్కడ, ఏవ్యవస్థలో పాలకవర్గాల పదవీకాలం ముగిసింది? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన మినహా.. అసలు ఎన్నికల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. అసలు ఎన్నికల వ్యవస్థ స్వత్రంత కలిగినా.. తనకంటూ ప్రత్యేకించి బలగం లేకపోవడమే.. ఎన్నికల నిర్వహణలో ధన ప్రవాహం జోరుగా సాగుతోందనే వాదనలు లేకపోలేదు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం, సదరు ఉద్యోగులకు గతంలోనే రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండడం.. ఎన్నికల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందన్న విషయాన్ని భారత ఎన్నికల సంఘం ఎందుకు గుర్తించడం లేదు! తనకంటూ ఓ బలగం ఉండి ఉంటే.. ఎన్నికల నిర్వహణ మరోలా ఉండేదేమో?!